Roja: 14 నుంచి 58కి చేరుకుంటాం: అసెంబ్లీలో జగన్‌కు రోజా సెల్యూట్

Minister Roja on women empowerment in assembly

  • మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన రోజా
  • చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మరని వ్యాఖ్య
  • అరెస్ట్ చేస్తారని లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారని ఎద్దేవా
  • వచ్చే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్... టీడీపీ నో మోర్... జనసేన పరార్ అన్న రోజా
  • అర్థమైందా రాజా! అంటూ రజనీకాంత్ సినిమా డైలాగ్

కసాయిని గొర్రె నమ్ముతుందేమో కానీ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును మాత్రం నమ్మరని మంత్రి రోజా అన్నారు. మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వాలంటీర్ వ్యవస్థతో మహిళలకు జగన్ అనేక పథకాలు తీసుకు వచ్చారన్నారు. ఆడపిల్లల కష్టాలు జగన్‌కు తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని చెప్పారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, ఆయనది బోగస్ ఆలోచన అన్నారు. చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్ అన్నారు. 

అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో దాక్కున్న లోకేశ్‌కు, జైల్లో ఉన్న చంద్రబాబుకు, అసెంబ్లీలో తొడగొట్టిన బాలకృష్ణకు ఒకటే చెబుతున్నానని, జగన్ ఈ నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నించారు. పసుపు జెండా, ఎర్రజెండా లేదా ఏ జెండా పట్టుకున్న వారైనా జగన్‌లా మహిళా అజెండాతో పనిచేసే వారిని చూపించాలని సవాల్ చేశారు. ప్రతిపక్ష టీడీపీ పనికిరాని పార్టీ అన్నారు.

జగన్‌ను ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి జైలుకు వెళ్లాడని, భయం ఎలా ఉంటుందో జగన్‌కు పరిచయం చేస్తానని చెప్పిన లోకేశ్ భయపడి ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఇంటికి పంపించడం, పార్టీ లేకుండా చేయడం వారి వల్ల కాదన్నారు. జగనన్నకు ఒంట్లో భయముండదు.. ఒంట్లో బెదురుండదు... మిమ్మల్ని కొట్టే దాంట్లో (ఎన్నికల్లో ఓడించడం) తిరుగుండదు.. అర్థమైందా రాజా! అని రజనీకాంత్ సినిమా డైలాగ్ చెప్పారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేశ్ కలిసినా, ట్వంటి24లో జగనన్న వన్స్ మోర్.. టీడీపీ నో మోర్, జనసేన పరార్ అన్నారు.

ప్రస్తుతం తాము 14 మంది మహిళా ఎమ్మెల్యేలం ఉన్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చాక 58కి చేరుకుంటామన్నారు. మహిళల గురించి చర్చ జరుగుతుంటే టీడీపీ సభలో లేకపోవడం సరికాదని, వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తోందన్నారు. వారు మహిళా వ్యతిరేకులు అన్నారు. బయట మహిళలను ఉద్ధరిస్తామని చెబుతారని, కానీ అసెంబ్లీలో మహిళల కోసం చర్చ సాగుతుంటే రాలేదన్నారు. మహిళా రిజర్వేషన్ కు మద్దతు తెలిపిన జగన్‌కు రోజా అసెంబ్లీ సాక్షిగా సెల్యూట్ చేశారు. మద్దతు తెలిపిన మిగతా సభ్యులకు నమస్కారం పెడుతూ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News