Tamilisai Soundararajan: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరిని తిరస్కరించడంపై స్పందించిన గవర్నర్ తమిళసై
- ఎందుకు తిరస్కరించానో అన్ని అంశాలను లేఖలో పేర్కొన్నట్లు తెలిపిన గవర్నర్
- ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఉత్తినే తిరస్కరించే వ్యక్తిని కాదని వెల్లడి
- తన నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చిన ట్వీట్లను రీట్వీట్ చేసిన గవర్నర్
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు పంపించగా, ఆమె ఈ రోజు తిరస్కరించారు. తిరస్కరించడానికి గల కారణాలను ఆమె పేర్కొన్నారు. అయితే సాయంత్రం మీడియా ప్రతినిధులు ఎందుకు తిప్పి పంపించారని ప్రశ్నించగా ఆమె మరోసారి స్పందించారు. తాను చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు. తాను అన్ని అంశాలను ఆ లేఖలోనే పొందుపరిచానని చెప్పారు. తాను ఉత్తినే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించే వ్యక్తిని కాదన్నారు.
గవర్నర్ నిర్ణయాన్ని పలువురు జర్నలిస్టులు సమర్థించారు. వీటిని ఆమె రీట్వీట్ చేశారు. గవర్నర్ నిర్ణయం 100 శాతం సరైనదని, అధికార పార్టీ నామినేట్ చేసినవారు ఏమైనా సైంటిస్టులా? సాహితీవేత్తలా? సమాజసేవకులా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిని గవర్నర్ రీట్వీట్ చేశారు.
కాగా, నామినేట్ చేసిన ఇద్దరికి తగిన అర్హతలు లేవని గవర్నర్ అంతకుముందు పేర్కొన్నారు. అర్హతలు ఉన్న ఎంతోమంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. అర్హులను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారికి గుర్తింపు లభించదన్నారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించకూడదో చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.