Chandrababu: ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్
- పిటిషన్ ను ఈరోజు మెన్షన్ చేయాలని నిన్న చంద్రబాబు న్యాయవాదులకు సూచించిన సీజేఐ
- సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందన్న సిద్ధార్థ్ లూథ్రా
- సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. సెక్షన్ 17ఏ కింద రాష్ట్ర గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శనివారం నాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడాన్ని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి లూథ్రా తీసుకొచ్చారు. చంద్రబాబును ఈ నెల 8న అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో సీజేఐ స్పందిస్తూ... పిటిషన్ ను రేపు మళ్లీ మెన్షన్ చేసి రావాలని సూచించారు. ఏం చేయాలనేది రేపు చూస్తామని చెప్పి విచారణను ముగించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతోందనేది ఉత్కంఠను రేపుతోంది.