K Kavitha: సుప్రీంకోర్టులో నేడు కవిత పిటిషన్ పై విచారణ.. బీఆర్ఎస్ లో తీవ్ర ఉత్కంఠ!
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
- మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడంపై సుప్రీంలో సవాల్ చేసిన కవిత
- సుప్రీంలో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. లిక్కర్ స్కామ్ విచారణలో మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కవిత పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించబోతోంది. ఈడీ దర్యాప్తులపై నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి కవిత పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు విచారించబోతోంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఈడీ ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకోవైపు, కవిత అంశంపై టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత జైలుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆమె జైలుకు వెళ్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు కవిత జైలుకు వెళ్లడం ఖాయమని... బీఆర్ఎస్, బీజేపీల నాటకంలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పారు.