Dream 11: దేశ పన్నుల చరిత్రలోనే తొలిసారి.. ‘డ్రీమ్ 11’కు 40 వేల కోట్లకు నోటీసు
- బెట్టింగుల ముఖ విలువపై 28 శాతం జీఎస్టీ ఎగవేసిందంటూ నోటీసులు
- గతంలో గేమ్‌క్రాఫ్ట్స్‌కు రూ. 21 వేల కోట్లకు నోటీసులు
- ఇప్పుడా రికార్డును అధిగమించిన ‘డ్రీమ్ 11’
బెట్టింగుల ముఖ విలువపై 28 శాతం జీఎస్టీని ఎగవేసిందంటూ పన్నుల శాఖ జారీచేసిన నోటీసుపై ‘డ్రీమ్ 11’ మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ (స్పోర్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) బాంబే హైకోర్టును ఆశ్రయించినట్టు ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. రూ. 21 వేల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి గేమ్‌క్రాఫ్ట్స్‌కు జారీ చేసిన నోటీసులే ఇప్పటి దేశ పరోక్ష పన్నుల చరిత్రలో ఇప్పటి వరకు రికార్డుగా నిలవగా, ఇప్పుడు డ్రీమ్ 11కు ఏకంగా రూ. 40 వేల కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి.
దేశ పరోక్ష పన్నుల చరిత్రలో ఇదే అతిపెద్ద క్లెయిమ్‌గా రికార్డులకెక్కింది. ‘ఎకనమిక్ టైమ్స్’ మాత్రం దీనిని రూ. 25 వేల కోట్లుగా పేర్కొంది. ఈ నోటీసులపై స్పందించేందుకు డ్రీమ్ స్పోర్ట్స్ నిరాకరించింది. డ్రీమ్ 11 సంస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై ఏకంగా రూ. 142 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.