Kapil Dev: 'కపిల్ దేవ్ కిడ్నాప్' వెనుక చాలా కథ ఉంది!
- క్రికెట్ లెజెండ్ కపిల్ ను కట్టేసి తీసుకెళుతున్న దృశ్యాలు వైరల్
- అదొక యాడ్ ఫిలిం అని ఆ తర్వాత వెల్లడి
- తాజాగా, ఆ యాడ్ డిస్నీ హాట్ స్టార్ యాప్ కు సంబంధించినదని తేలిన వైనం
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను కొందరు వ్యక్తులు చేతులు కట్టేసి, నోటికి గుడ్డ చుట్టేసి లాక్కెళుతున్న దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియో ఓ వాణిజ్య ప్రకటన కోసం రూపొందించిందని ఆ తర్వాత వెల్లడైంది. తాజాగా, ఆ యాడ్ ఫిలింకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్ లను టీవీల్లో కోట్లాది మంది చూస్తారు. అయితే, కరెంటు కోతలతో వరల్డ్ కప్ మ్యాచ్ ల వీక్షణకు అంతరాయాలు ఏర్పడతాయని, అదే తమ యాప్ లో అయితే కరెంటు పోయినా సరే నిరంతరాయంగా మ్యాచ్ ను తిలకించవచ్చని చెప్పేందుకే డిస్నీ హాట్ స్టార్ ఈ యాడ్ ను రూపొందించింది.
ఈ యాడ్ ఫిలిం విషయానికొస్తే... కపిల్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆయనను ఓ ఇంటిలో బంధిస్తారు. కపిల్ ను కాపాడేందుకు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముడతారు. ఓ పోలీస్ ఆఫీసర్ మైక్ అందుకుని, కపిల్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని దుండగులను ప్రశ్నిస్తాడు. వరల్డ్ కప్ వేళ కరెంటు కోతలు లేకుండా మ్యాచ్ లు ప్రసారం చేస్తామని హామీ ఇస్తే కపిల్ ను వదిలిపెడతామని కిడ్నాపర్లు బదులిస్తారు.
అప్పుడా పోలీసాఫీసర్... కరెంట్ గురించి చింతించవద్దు... డిస్నీ హాట్ స్టార్ యాప్ ఉందిగా... వరల్డ్ కప్ మ్యాచ్ లను ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చు... పూర్తి ఉచితంగా... అంటూ స్పందిస్తాడు.
డిస్నీ హాట్ స్టార్ లో ఉచితంగా ఉంటే ఐదు నిమిషాలే చూసే వీలుంటుంది కదా అని ఓ కిడ్నాపర్ ప్రశ్నించగా... మ్యాచ్ మొత్తం చూడొచ్చు అని ఆ పోలీస్ ఆఫీసర్ వివరిస్తాడు. మరి డేటా సంగతేంటి? అని కిడ్నాపర్ అడగ్గా, డేటా సేవింగ్ మోడ్ లో మ్యాచ్ మొత్తాన్ని ఫ్రీగా చూసేయొచ్చు అని పోలీస్ ఆఫీసర్ స్పష్టం చేశాడు.
దాంతో, ఆ కిడ్నాపర్లు, కపిల్ దేవ్, పోలీసులు ఒక్కచోట చేరి డిస్నీ హాట్ స్టార్ యాప్ లో క్రికెట్ ప్రసారాలు చూస్తుండగా, యాడ్ సుఖాంతమవుతుంది.