Nara Lokesh: టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం
- ఇటీవలే టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పాటు
- నేడు తొలి సమావేశం
- ఢిల్లీ నుంచి దిశానిర్దేశం చేసిన లోకేశ్
- టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో వరుస భేటీలు, జాతీయస్థాయి మీడియా సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఏపీలోని టీడీపీ అగ్రనేతలతో అనుక్షణం టచ్ లో ఉంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలను ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నారు.
ఇవాళ టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ (పీఏసీ) సమావేశం కాగా, ఢిల్లీ నుంచి లోకేశ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవలే ఏర్పాటు కాగా, ఇదే తొలి సమావేశం. పీఏసీ సభ్యులకు లోకేశ్ పలు సూచనలు అందజేశారు.
ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, బాలకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. టీడీపీ పీఏసీ సమావేశంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైనా చర్చించారు. లోకేశ్ పై కేసు నమోదవడం పట్ల కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
పీఏసీ సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు.
లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.