Hindu Temple: అమెరికాలో అరుదైన హిందూ దేవాలయం... ప్రత్యేకత ఇదే!
- పూర్తిగా చేతితో చెక్కిన విశిష్ట దేవాలయం
- న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మాణం
- అక్టోబరు 8న ఆలయ ప్రారంభోత్సవం
అమెరికాలో ఓ హిందూ దేవాలయం విశిష్ట రీతిలో నిర్మాణం జరుపుకుంది. ఈ ఆలయాన్ని పూర్తిగా చేతితోనే చెక్కారు. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన ఈ అరుదైన హిందూ దేవాలయాన్ని అక్టోబరు 8న ప్రారంభించనున్నారు. ఆధునిక కాలంలో భారత్ వెలుపల నిర్మాణం జరుపుకున్న దేవాలయాల్లో అతిపెద్దది ఇదే.
భారతీయ శిల్ప కళ, సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదలను ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ మహామందిర్ ను 19వ శతాబ్దపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భగవాన్ స్వామినారాయణ్ కు అంకితం ఇచ్చారు. భగవాన్ స్వామినారాయణ్ తర్వాత ఐదో తరం ఆధ్యాత్మిక వారసుడు, ప్రముఖ సాధువు ప్రముఖ్ స్వామి మహరాజ్ ఈ ఆలయ నిర్మాణానికి ఆద్యుడు. 12,500 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
2015లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం 183 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ ప్రాంగణం ఉంటుంది. ఆలయ నిర్మాణంలో 10 వేల విగ్రహాలు, ప్రతిమలు చెక్కారు. ఆలయ నిర్మాణం కోసం ప్రధానంగా లైమ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్, మార్బుల్, గ్రానైట్ బండలను ఉపయోగించారు.
కాగా, ప్రారంభోత్సవానికి అమెరికా చట్టసభల సభ్యులు కూడా హాజరుకానున్నారు. బైడెన్ ప్రభుత్వంలోని ప్రముఖులు, అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు.