Jaishankar: నాటి నుంచి భారత్-చైనా సంబంధాలు బెడిసి కొట్టాయ్: జైశంకర్
- 2020 గల్వాల్ లోయ ఘర్షణను ప్రస్తావించిన వివేశాంగ మంత్రి
- మూడేళ్లుగా అసహజ స్థితిలోనే సంబంధాలు ఉన్నట్టు వెల్లడి
- ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగొచ్చన్న అభిప్రాయం
భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2020 గల్వాల్ లోయ ఘర్షణ తర్వాత నుంచి అసహజ స్థితిలో ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలానికి కొనసాగొచ్చన్నారు. రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి తాలూకూ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. భారత్-చైనా సంబంధాలపై ఎదురైన ఓ ప్రశ్నకు బదులుగా జైశంకర్ ఈ అంశంపై స్పందించారు.
‘‘వారు (చైనా) ఎప్పుడు ఎందుకు చేస్తారన్నది చెప్పరు. గత మూడేళ్ల కాలాన్ని చూస్తే చాలా అసహజ స్థితిలోనే రెండు దేశాల సంబంధాలు ఉన్నాయి. సంప్రదింపులకు విఘాతం ఏర్పడింది. సందర్శనలు నిలిచిపోయాయి. అధిక స్థాయిలో సైనిక ఉద్రిక్తత నెలకొంది. భారత్ లో చైనా పట్ల ఉన్న అభిప్రాయంపైనా ఈ ప్రభావం పడింది. కనుక ఇది స్వల్ప కాలమే కాదు, మధ్య, దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు’’ అని జైశంకర్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దీర్ఘకాలంలో అంత సవ్యంగా లేవన్న విషయాన్ని గుర్తు చేశారు.
‘‘1962లో యుద్ధం వచ్చింది. ఆ తర్వాత సైనిక ఘటనలు జరిగాయి. 1975 తర్వాత సరిహద్దుల్లో ఎప్పుడూ ప్రాణ నష్టం జరగలేదు. 1988లో ప్రధాని రాజీవ్ గాంధీ చైనాలో పర్యటించిన తర్వాత సంబంధాలు సాధారణ స్థితికి చేరాయి’’ అని జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు విషయమై 1993లో, 1996లో చైనాతో భారత్ రెండు ఒప్పందాలు చేసుకుందని చెబుతూ.. కనుక వీటిపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు.