Alla Ramakrishna Reddy: లోకేశ్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశాను: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను వారి వ్యక్తులకు అనుకూలంగా మార్చారన్న ఆర్కే
- కోర్టు విచారణలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్న
- చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలన్న ఎమ్మెల్యే వరప్రసాద్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ని 14వ ముద్దాయిగా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పాత్ర ఉందనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో వారికి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేశారని ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తానని చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడూ చెపుతుంటారని... అలాంటప్పుడు కోర్టు విచారణల విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ వైపు తిప్పుకున్నారని మండిపడ్డారు. తిరుపతి ఎంపీగా తాను ఉన్నప్పుడు టీడీపీలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని.. తనకు ఏకంగా రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాదిరి దిగజారిన రాజకీయాలు చేసేవారు ఎవరూ ఉండరని అన్నారు.