AP High Court: జడ్జిలపై ట్రోలింగ్ కేసు: బుద్దా వెంకన్న, బుచ్చయ్య చౌదరి సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలంటూ డీజీపీకి హైకోర్టు ఆదేశం
- స్కిల్ కేసులను విచారించిన జడ్జిలపై ట్రోలింగ్ చేస్తున్నారంటూ పిటిషన్
- ప్రభుత్వం తరపున వాదించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
- తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు గుప్పించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇద్దరు హైకోర్టు జడ్జిలు, ఏసీబీ జడ్జిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ జరిగిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. క్రిమినల్ కంటెంప్ట్ కింద ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ చేసిన 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ జాబితాలో బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎస్ రామకృష్ణ, గోనె రామకృష్ణ, మువ్వా తారక్ కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజు తదితరులు ఉన్నారు.