BJP: నాకు పోటీ చేయడం ఇష్టంలేదు... కానీ, పార్టీ ఆదేశాలు పాటిస్తా: బీజేపీ నేత విజయ్ వర్గీయా
- కైలాశ్ విజయ్ వర్గీయాకు ఇండోర్ 1 సీటును కేటాయించిన బీజేపీ
- తనకు, తన తనయుడికి టిక్కెట్ ఇస్తారని భావించలేదని వ్యాఖ్య
- పోటీ చేయాలనే ఆసక్తి ఒక శాతం కూడా లేదని, కానీ పార్టీ ఆదేశాలు పాటిస్తానని వెల్లడి
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయా, ఆయన తనయుడి పేర్లు కూడా వున్నాయి. కైలాశ్‌కు ఇండోర్ 1 సీటును కేటాయించారు. అయితే ఆయన బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉన్నానని, తనకు, తన తనయుడు ఆకాశ్‌కు టిక్కెట్లు ఇస్తారని భావించలేదన్నారు. తన కొడుకు బాగా పనిచేస్తున్నాడని, ఇక నేను ఎందుకు పోటీ చేయాలి? అని ప్రశ్నించారు. తన వల్ల తన తనయుడి రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగకూడదన్నారు. అందుకే పోటీకి దూరంగా ఉండాలనుకున్నానని, కానీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చిందని, పార్టీ ఆదేశాలు పాటిస్తానన్నారు.
తనకు పోటీ చేయాలనే ఆసక్తి కనీసం ఒక శాతం కూడా లేదన్నారు. కానీ పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చిందని, తాను పార్టీ ఆశలు అడియాసలు చేయనన్నారు. పార్టీ ఆదేశాలను తిరస్కరించకూడదని చెప్పారు. తాము పార్టీ కోసం పని చేసే కార్యకర్తలమన్నారు. పార్టీ ఆదేశాలు పాటించాల్సిందే అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కైలాశ్ విజయ్ వర్గీయా సహా ఎనిమిది మంది కీలక నేతలు పోటీ చేయనున్నారు. ఇందులో కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. తాను సీనియర్ నాయకుడినని, ప్రస్తుతం ఎన్నికల కోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయండని అభ్యర్థించాలా? అన్నారు.