Canada: జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందంటూ వచ్చిన వార్తలను ఖండించిన కెనడా ప్రధాని కార్యాలయం
- ట్రూడో భారత్ వచ్చినప్పుడు అతని విమానం నిండా కొకైన్ ఉందన్న మాజీ దౌత్యవేత్త
- ట్రూడోపై సంచలన ఆరోపణలు చేసిన సూడాన్ భారత మాజీ రాయబారి వోహ్రా
- ఇది పూర్తిగా అవాస్తవమన్న కెనడా ప్రధాని కార్యాలయం
భారత్ లో ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానం నుంచి భారత స్నిఫర్ డాగ్స్ కొకైన్‌ను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని భారత మాజీ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను కెనడాలోని ప్రధానమంత్రి కార్యాలయం తోసిపుచ్చింది.
సూడాన్‌లో భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా సోమవారం ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల జీ20 కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌కు వచ్చినప్పుడు, ఆయన విమానం కొకైన్‌తో నిండి ఉందని, ఆయన రెండు రోజులు తన గది నుండి బయటకు రాలేదని వోహ్రా అన్నారు. అలాగే ట్రూడో చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడని, అంతర్జాతీయ సంబంధాల గురించి అంత పరిజ్ఞానం లేదన్నారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ట్రూడోను తన భార్య చూసిందని, అతను కాస్త ఒత్తిడిలో కనిపించాడని, కారణం తెలియదు కానీ, ఆ తర్వాత సోషల్ మీడియాలో మాత్రం ఆయన విమానంలో కొకైన్ ఉన్నట్లుగా ప్రచారం సాగిందని, డ్రగ్స్ తీసుకోవడంతో ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపించాడని వోహ్రా చెప్పారు.
అయితే, కెనడా ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఆరోపణలు నిరాధారమైనవి అంటూ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవం మరియు తప్పుడు సమాచారమని, తప్పుడు సమాచారం మీడియా రిపోర్టింగ్‌లోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పడానికి ఇది మంచి నిదర్శమని కెనడా ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్టు 'టొరంటో సన్' మీడియా సంస్థ ఓ కథనం వెలువరించింది.