Katragadda Prasuna: టీడీపీ ఉనికి ఎక్కడన్న కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. కేసీఆర్ రాజకీయ అరంగేట్రమే టీడీపీతోనని కౌంటర్
- టీడీపీలో కేసీఆర్ అనేక పదవులు అనుభవించారన్న ప్రసూన
- కవిత అరెస్ట్ భయంతో ఢిల్లీ, మహారాష్ట్రలో నిరసనలు చేయలేదా? అని నిలదీత
- బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చింది టీడీపీయేనని స్పష్టీకరణ
తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడన్న మంత్రి కేటీఆర్‌పై, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తీవ్రస్థాయిలో స్పందించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానమే టీడీపీతో మొదలైందని గుర్తు చేశారు. టీడీపీలో ఆయన అనేక పదవులు అనుభవించారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు రాజకీయ అధికారం కట్టబెట్టింది టీడీపీయేనని వివరించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ అరెస్టు అవుతుందోనన్న భయంతో ఢిల్లీ, మహారాష్ట్రలో పార్టీ నాయకులతో ఆందోళనలు నిర్వహించలేదా? అని ప్రశ్నించారు.
మరోవైపు, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూలోని పోస్టాఫీస్ నుంచి రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపారు. చంద్రబాబు అరెస్టులో ఏపీ సీఎం జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ పాత్ర కూడా ఉందని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక నేతలు ఆరోపించారు.