World Cup: హైదరాబాద్ లో రెండు వారాలు ఉండనున్న పాక్ జట్టు .. ఎక్కడ బస చేస్తుందంటే..!
- ప్రపంచ కప్ కోసం నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్
- రెండు వామప్ మ్యాచ్ లు, రెండు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడనున్న దాయాది జట్టు
- ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఏడేళ్ల తర్వాత భారత్ లో అడగు పెట్టింది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని జట్టు వన్డే వరల్డ్ కప్ కోసం బుధవారం నిన్న హైదరాబాద్ చేరుకుంది. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన పాక్ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. దాంతో పాటు ప్రస్తుత పాక్ జట్టులో ఇద్దరే ఇది వరకు భారత్ లో పర్యటించారు. అఘా సల్మాన్, నవాజ్ కు మాత్రమే భారత్ లో ఆడిన అనుభవం ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 2016 టీ20 ప్రపంచ కప్ లో ఆడలేకపోయాడు. కాగా, విమానాశ్రయంలో దిగిన పాక్ క్రికెటర్లను అధికారులు భారీ పోలీసు భద్రతతో ప్రత్యేక బస్లో టీమ్ బస చేసే హోటల్ కు తీసుకెళ్లారు.
పాకిస్థాన్ దాదాపు రెండు వారాలు హైదరాబాద్ లో ఉండి రెండు వామప్ మ్యాచులు, రెండు వరల్డ్ కప్ మ్యాచులు ఆడనుంది. ఆ జట్టుకు నగరంలోని ప్రముఖ హోటల్ పార్క్ హయత్ లో బస ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు పాక్ జట్టు పార్క్ హయత్ హోటల్లోనే ఉండనుంది. మరో వైపు న్యూజిలాండ్ జట్టు రెండు విడతలుగా హైదరాబాద్ చేరుకుంది. ఆ జట్టు ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వామప్ మ్యాచ్ లో పాల్గొంటాయి. కాగా, ఈ రోజు ఉదయం ఉప్పల్ స్టేడియంలోని నెట్స్ లో పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది.