Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో చైనాకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు
- తేజు పట్టణంలో విద్యార్థుల భారీ ర్యాలీ
- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మ దహనం
- అథ్లెట్లకు న్యాయం చేయాలని డిమాండ్
- ఒక్కొక్కరికి రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సర్కారు
చైనా వైఖరి పట్ల అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు. ఏషియన్ గేమ్స్ 2023 ను చైనా నిర్వహిస్తుండడం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ నుంచి హాజరు కావాల్సిన భారత అథ్లెట్ల విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లు నైమన్ వాంగ్సు, ఒనిలు తేగ, మెపంగ్ లమ్గ్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొనాల్సి ఉంది. వీరిలో ఇద్దరికి స్టాపుల్డ్ వీసాలను చైనా మంజూరు చేసింది. వీరికి అక్రెడిటేషన్ ఇవ్వలేదు. మరో అధ్లెట్ కు అక్రిడిటేషన్ ఇచ్చింది. చైనా వైఖరికి నిరసనగా వీరు ముగ్గురూ ఏషియన్ గేమ్స్ కు దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలో చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్, స్థానిక విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించాయి. పలు విద్యాలయాలకు చెందిన 300కు పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. క్లాక్ టవర్ నుంచి గాంధీ చౌక్ వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మను నిరసనకారులు తగలబెట్టారు. ముగ్గురు అథ్లెట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించి, పాల్గొనలేకపోయిన ముగ్గురు అథ్లెట్లకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండు రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించి, ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొనలేకపోయారని పేర్కొన్నారు. ఇందులో వారి తప్పు ఏమీ లేనందున రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని ఇస్తామని తెలిపారు. 2026 జపాన్ లోని టోక్యోలో జరిగే ఏషియన్ గేమ్స్ కు బాగా సన్నద్ధం కావాలని వుషూ క్రీడాకారులకు సూచించారు.