Sir Michael Gambon: అనారోగ్యంతో హ్యారీ పోటర్ నటుడి కన్నుమూత
- ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సర్ మైఖేల్ గాంబోన్
- కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న నటుడు
- హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాల్లో ప్రొఫెసర్ ఆల్బస్ గా పాత్రోచిత నటన
- 8 హ్యారీ పోటర్ చిత్రాల్లో ఆరింట్లో నటించిన గాంబోన్
హ్యారీ పోటర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సర్ మైఖేల్ గాంబోన్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హ్యారీ పోటర్ చిత్రాల్లో మైఖేల్ గాంబోన్ ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్ డోర్ పాత్ర పోషించారు. హ్యారీ పోటర్ సిరీస్ లో మొత్తం 8 చిత్రాలు ఉండగా, ఆయన ఆరింట్లో నటించారు.
కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న గాంబోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు భార్య, కుమారుడు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జన్మించిన గాంబోన్ బాల్యంలోనే కుటుంబంతో సహా లండన్ తరలివచ్చారు. నాటకరంగం, టీవీ, సినిమాలు, రేడియో... ఇలా నటనకు అవకాశమున్న ప్రతి చోట తన ప్రతిభను ప్రదర్శించారు. సర్ మైఖేల్ గాంబోన్ తన కెరీర్ లో 4 పర్యాయాలు ప్రతిష్ఠాత్మక బాఫ్టా అవార్డులు అందుకున్నారు. నాటకరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం 1998లో ఆయనను నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.