Janasena: టీడీపీతో పొత్తుపై జనసేన జిల్లా, నగర అధ్యక్షుల ఏకగ్రీవ తీర్మానం
- వారాహి యాత్ర అక్టోబర్ 1న ప్రారంభమవుతుందన్న నాదెండ్ల మనోహర్
- టీడీపీతో పొత్తు ప్రకటనపై జనామోదం ఉందని వ్యాఖ్య
- టీడీపీతో ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించాలని సూచన
పవన్ కల్యాణ్ నాలుగో దశ వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ నిర్ణయానికి జనామోదం ఉందన్నారు. వారాహి యాత్ర అక్టోబర్ 1న అవనిగడ్డలో ప్రారంభమవుతుందన్నారు. టీడీపీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణపై మాట్లాడుతూ... విస్తృతస్థాయి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పవన్ ప్రకటించారన్నారు. అయితే ఇరువురు అధినేతలు కలిసి చర్చించుకునే అవకాశం రాలేదన్నారు. అందుకే ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదన్నారు.
టీడీపీ చేస్తోన్న ఆందోళనలు, జనసేన మద్దతు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నాయకులకు వివరించారు. టీడీపీ నాయకులతో ఎక్కడా పొరపొచ్చలు రాకుండా సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపుల ద్వారా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే ఎప్పటిలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాగా, టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా, నగర అధ్యక్షులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.