Hyderabad: పాక్ క్రికెటర్లను ఆకట్టుకున్న ఆరడుగుల తొమ్మిది అంగుళాల హైదరాబాదీ బౌలర్
- పాక్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసిన హైదరాబాద్ అండర్-19 క్రికెటర్ నిశాంత్ శరణు
- ప్రస్తుతం గంటకు 130 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పిన నిశాంత్
- లక్నో జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేయమని మోర్నే మోర్కెల్ అడిగారని వెల్లడి
ఆరడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తుతో ఉన్న హైదరాబాద్ అండర్-19 పేసర్ నిశాంత్ శరణు పాకిస్థాన్ క్రికెటర్లను నెట్స్ లో ఆకట్టుకున్నాడు. గురువారం ప్రపంచ కప్‌కు ముందు పాకిస్థాన్ ప్రారంభ నెట్ సెషన్లో చాలామంది దృష్టిని ఇతను ఆకర్షించాడు. అండర్-19 క్రికెట్‌కు రెండో ఏడాది ఆడుతోన్న నిశాంత్ భాగ్యనగరానికి చేరుకున్న పాక్ క్రికెటర్లకు బౌలింగ్ వేసే నెట్ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది.
హరీస్ రవూఫ్, షహీన్ అఫ్రిదిల స్పెల్ తర్వాత... పాక్ బౌలర్లకు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తోన్న నెట్ బౌలర్ల నుంచి నిషాంత్‌ను ఎంచుకున్నారు. రవూఫ్, షహీన్‌లు సాధారణంగా 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంటారు. అయితే ఈ హైదరాబాద్ యువ పేసర్ నిశాంత్ తన బౌలింగ్ వేగాన్ని క్రమంగా పెంచాలని కోరారు. నెట్స్‌లో ఉన్న పేసర్లందరికీ ఈ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను మినహాయించి టెయిలెండర్స్కు నిశాంత్ బౌలింగ్ చేశాడు.
తాను ప్రస్తుతం గంటకు 125 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలుగుతున్నానని, దక్షిణాఫ్రికా దిగ్గజం, లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వేగాన్ని పెంచమని అడిగాడని, అలాగే లక్నో సూపర్ జెయింట్స్ నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి అందుబాటులో ఉంటావా? అని అడిగాడని నిశాంత్ చెప్పాడు.
అంతర్జాతీయ బ్యాటర్లకు బౌలింగ్ చేయడం నిశాంత్‌కు ఇది కొత్తేం కాదు. భారత్-న్యూజిలాండ్ వన్డేకు ముందు నిశాంత్‌ను పిలిచారు. పాక్ జట్టు దాదాపు రెండు వారాల పాటు హైదరాబాద్‌లోనే ఉంటున్నందున నిశాంత్‌కు బౌలింగ్ చేయడానికి అనేక అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అన్నట్టు నిశాంత్ కు ఆసీస్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్ ప్యాట్ కమ్మిన్స్ స్ఫూర్తి అట!