Air India: మరుగుతున్న నీళ్లు జార విడిచిన ఎయిర్‌హోస్టస్.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి గాయాలు

Air India flyer suffers second degree burn after crew member spills hot water

  • న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఇటీవల ఘటన
  • ఎయిర్‌హోస్టస్ పొరపాటుతో మహిళ కాలికి సెకెండ్ డిగ్రీ గాయాలు
  • శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగాక బాధితురాలు ఆసుపత్రి పాలు
  • ఎయిర్ ఇండియా సిబ్బంది తన విషయంలో సరిగా స్పందించలేదంటూ మహిళ ఆరోపణ

ఎయిర్ ఇండియా విమానంలో అమెరికాకు బయలుదేరిన ఓ ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఎయిర్‌హోస్టస్ ఆమె కాలిపై వేడి నీళ్లు జారవిడవడంతో మహిళ గాయాల పాలైంది. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు ఎక్స్ వేదికగా తన ఆవేదన వెళ్లబోసుకుంది. న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు తన తల్లి, కూతురితో కలిసి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. 

విమానంలోని సిబ్బందికి అత్యవసర సమయాల్లో ఏం చేయాలనేదానిపై సరైన శిక్షణ లేదని బాధితురాలు ఆరోపించింది. కాలిపై వేడి నీళ్లు జారవిడిచిన ఎయిర్ హోస్టస్ ఆ తరువాత ఏం చేయాలో అర్థంకాక గాబరాతో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది. విమానంలోని ఓ వైద్యుడు తనకు సెకెండ్ డిగ్రీ గాయాలు అయ్యాయని చెప్పారని తెలిపింది. అయితే, ఆ సమయంలో చికిత్స చేసేందుకు అవసరమైన అత్యవసర మెడికల్ కిట్స్ ఏవీ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా తాను దాదాపు రెండు గంటల పాటు నొప్పితో విలవిల్లాడాల్సి వచ్చిందని పేర్కొంది. విమానం ల్యాండయ్యే సమయంలో కూడా సిబ్బంది తన విషయాన్ని పక్కనపెట్టి ఇతర ఏర్పాట్లలో మునిగిపోయారని చెప్పుకొచ్చింది. కాగా, శాన్‌ఫ్రాన్‌సిస్కోలో దిగాక బాధితురాలు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 

ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా బాధితురాలికి క్షమాపణలు తెలిపింది. కాలికి గాయమైన వెంటనే తమ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారని చెప్పింది. బాధితురాలికి అన్ని రకాల సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

  • Loading...

More Telugu News