Pakistan: భారత్‌ను శత్రుదేశమన్న పీసీబీ చీఫ్‌పై నిప్పులు చెరుగుతున్న పాకిస్థాన్ నెటిజన్లు
- పాక్ ఆటగాళ్లు ఏ దేశానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారన్న పీసీబీ చీఫ్
- మన శత్రుదేశం ఉన్నా మన ఆటగాళ్లు నీతికి కట్టుబడి ఉంటారన్న జకా అష్రఫ్
- భారత్ మనకు శత్రుదేశం కాదంటూ పాక్ నెటిజన్ల కౌంటర్
- మీలాంటి వారి వల్లే అందరు అలా అనుకుంటున్నారన్న మరో నెటిజన్
భారత్‌ను పేర్కొనే క్రమంలో దుష్మన్ అంటూ వ్యాఖ్యానించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మేనేజ్మెంట్ కమిటీ చైర్ పర్సన్ జకా అష్రఫ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నెట్టింట ఆయన వ్యాఖ్యలను అందరూ తప్పుబడుతున్నారు. వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ భారత్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాలు ఇక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలో జకా అష్రఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తమ ఆటగాళ్లకు మంచి కాంట్రాక్ట్‌లను అందించడం ఆనందంగా ఉందని, గతంలో ఎన్నడూ పాక్ క్రికెట్ చరిత్రలో ఇలా చేయలేదన్నారు. ఆటగాళ్లకు పెద్ద మొత్తం కేటాయించినట్లు చెప్పారు. ఇంతకుముందు పాక్ క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు. మన ఆటగాళ్లు ఎప్పుడైనా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. ఇంకా మాట్లాడుతూ... అందులో మన శత్రుదేశం ఉన్నా సరే పాక్ ఆటగాళ్లు నీతికి కట్టుబడి ఉంటారన్నారు.
అయితే, ఆయన భారత్‌ను శత్రుదేశంగా పేర్కొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్‌లో క్రికెట్ అభిమానులు పాక్ క్రికెటర్లకు ఘనస్వాగతం పలికారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సొంత దేశం పాకిస్థాన్‌లోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పీసీబీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, పొరుగుదేశాన్ని శత్రుదేశంగా అభివర్ణించడం సరికాదని ఓ పాకిస్థానీ నెటిజన్ మండిపడ్డారు. మన ఆటగాళ్లకు అక్కడ అద్భుతమైన స్వాగతం లభించిందని, పాక్‌కు అసలైన శత్రువు జకా అష్రాఫ్ అన్నారు. అతడు రాజకీయాల్లో పావుగా మారిపోయాడని, కాబట్టి అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారత్ మనకు శత్రుదేశం కాదని, మీలాంటి వారి వల్లే అంతా అలా అనుకుంటున్నారని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య ప్రకటన అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.
ఓవైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారత్‌లో ఘనస్వాగతం లభిస్తే మరోవైపు పీసీబీ చీఫ్ భారత్‌ను శత్రుదేశంగా పేర్కొన్నారని, మనం ఏం చేసినా వారికి అవసరం లేదు, పాకిస్థాన్ మెంటాలిటీ, అజెండా చాలా స్పష్టంగా ఉందంటూ అన్షుల్ సక్సేనా అనే భారత నెటిజన్ పేర్కొన్నారు.