Rachin Ravindra: ఉప్పల్ లో పాక్ పై బౌండరీల వర్షం కురిపించిన రచిన్ రవీంద్ర
- హైదరాబాద్ లో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన పాక్
- 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు
- లక్ష్యఛేదనలో దీటుగా ఆడుతున్న న్యూజిలాండ్
- 72 బంతుల్లో 97 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర
- 16 ఫోర్లు కొట్టిన యువ కెరటం
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురుస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర స్వైర విహారం చేశాడు.
సాధారణంగా లోయర్ ఆర్డర్ లో వచ్చే రచిన్ రవీంద్రను కివీస్ మేనేజ్ మెంట్ ప్రయోగాత్మకంగా ఓపెనర్ గా బరిలో దించింది. ఈ నిర్ణయం సత్ఫలితాన్నిచ్చింది. పాకిస్థాన్ జట్టులోని మేటి బౌలర్లను కూడా లెక్కచేయకుండా రవీంద్ర దూకుడుకు ప్రాధాన్యతనిచ్చాడు.
ఈ కుర్ర ఆల్ రౌండర్ కేవలం 72 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర స్కోరులో ఏకంగా 16 ఫోర్లు ఉండడం విశేషం. ఓ సిక్స్ కూడా కొట్టాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (0) డకౌట్ అయినప్పటికీ రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు.
ఇక, మిడిలార్డర్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 54 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 35 ఓవర్లలో 4 వికెట్లకు 246 పరుగులు కాగా... డారిల్ మిచెల్ 48, మార్క్ చాప్ మన్ 15 పరుగులతో ఆడుతున్నారు. కివీస్ గెలవాలంటే ఇంకా 90 బంతుల్లో 98 పరుగులు చేయాలి. పాక్ బౌలర్లలో ఉస్మాన్ మిర్ 2, హసన్ అలీ 1, ఆఘా సల్మాన్ 1 వికెట్ తీశారు.