Hyderabad: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. 400 మంది అరెస్ట్!
- శుక్రవారం నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పత్రికా సమావేశం
- గణేశ్ నిమజ్జనం ముగిసిందని ప్రకటన
- నిర్దేశిత సమయానికి కంటే ముందే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరిగిందన్న సీపీ
- నిమజ్జనంలో ఆకతాయిల ఆగడాలకు షీటీమ్స్తో అడ్డుకట్ట వేసినట్టు వెల్లడి
గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 400 మందిపై షీటీమ్స్ కేసులు పెట్టినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తాజాగా వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం ముగిసిందని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్సవాలకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం చేసిన 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. శోభయాత్రకు కొందరు మద్యం మత్తులో వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని నిర్దేశిత సమయానికంటే ముందుగానే నిమజ్జనం చేశామని సీపీ తెలిపారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం ఈ పర్యాయం పదివేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరిగిందని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 శాతం అధికంగా విగ్రహాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
కాగా, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం పెద్దలు తీసుకున్న నిర్ణయంపై కూడా కమీషనర్ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. గణేశ్ శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అక్టోబర్ 1న ర్యాలీని నిర్వహించేందుకు ముస్లిం పెద్దలు నిర్ణయించారని తెలిపారు. ఇక మిలాద్ ఉన్ నబీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేశామని చెప్పారు. చెయిన్ స్నాచింగ్లు, వేధింపులు వంటివి చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేందుకు నగర పోలీసులు ఎంతో శ్రమించారని సీవీ ఆనంద్ ప్రశంసించారు.