Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

IMD predicts rains in Telangana due to low pressure regions over bay of bengal

  • ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆవర్తనం 
  • ఫలితంగా తెలంగాణలో శని, ఆది వారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, హైదరాబాద్‌లోనూ జల్లులు
  • వాతావరణ శాఖ ప్రకటన

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 8.2 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 8, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 7.4, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6.7, కరీంనగర్ జిల్లా గంగాధరలో 6.4, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగాను, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

  • Loading...

More Telugu News