Hero Siddharth: కన్నడ చిత్ర పరిశ్రమ తరఫున హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపిన శివరాజ్ కుమార్
- 'చిత్తా' సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన సిద్ధార్థ్
- సిద్ధార్థ్ ప్రెస్ మీట్లో కావేరీ జలాల నిరసనకారుల హంగామా
- ప్రెస్ మీట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన సిద్ధార్థ్
- ఇప్పటికే సిద్ధార్థ్ కు క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్
- మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామన్న శివరాజ్ కుమార్
తన కొత్త చిత్రం 'చిత్తా' ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు వచ్చిన హీరో సిద్ధార్థ్ కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, కావేరీ జలాల నిరసనకారులు ఆ సమావేశంలోకి ప్రవేశించి, సిద్థార్థ్ ను అక్కడ్నించి వెళ్లిపోవాలని కోరారు. దాంతో సిద్ధార్థ్ మీడియా సమావేశం మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.
దీనిపై ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ హీరో సిద్థార్థ్ కు క్షమాపణలు చెప్పారు. కావేరీ జలాలపై రాజకీయ పార్టీల నేతలను నిలదీయకుండా కళాకారులను ఇబ్బందిపెట్టడం న్యాయమేనా? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
తాజాగా, కన్నడ అగ్రహీరో శివరాజ్ కుమార్ కూడా సిద్ధార్థ్ విషయంలో స్పందించారు. కన్నడ చిత్ర పరిశ్రమ తరఫున సిద్ధార్థ్ కు క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. నిన్న జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు.
కన్నడ ప్రజలు అన్ని భాషల చిత్రాలను ఇష్టపడతారని, ఏ భాషకు చెందిన సినిమాను అయినా తమదిగా భావించి ఆదరిస్తారని వివరించారు. ఈ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శివరాజ్ కుమార్ పిలుపునిచ్చారు. మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.