Mohanlal: మలయాళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్న లైకా ప్రొడక్షన్స్!
- మలయాళంలో సంచలనం సృష్టించిన 'లూసీఫర్'
- ఆ సినిమా సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు
- ఈ సినిమాతో అక్కడ రంగంలోకి దిగుతున్న లైకా
- అందరిలో పెరుగుతున్న అంచనాలు
మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి అటు మాస్, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ కంప్లీట్ యాక్టర్ ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్. చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల పైగా అనుభవం, 350 సినిమాలు ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టాయి. ఆయన నటనతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఇప్పటికీ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా కొనసాగుతున్నారు.
అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన మలయాళం సహా పలు భాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు. 2019లో ఈయన డైరెక్ట్ చేసిన సినిమా 'లూసిఫర్' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ చిత్రం రూపొందనుంది.
ఆంటోని పెరంబవూర్ చైర్మన్‌గా కొనసాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌తో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కలయికలో, ఈ సినిమా రూపొందనుంది. కేరళలో సినీ నిర్మాణ రంగంలోకి లైకా ప్రొడక్షన్స్ సంస్థ అడుగుపెడుతున్న సందర్భంగా కేరళ ప్రాంతం ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan)’ నిర్మాణ భాగస్వామి ఆశ్వీర్వాద్ సినిమాస్ తెలియజేసింది.
‘లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయటానికి ఎప్పుడూ ఆసక్తిని చూపుతుంటారు. లైకా ప్రొడక్షన్స్ మలయాళంలో సినిమాల తీయటానికి సిద్ధమవటం అనేది చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదం చేయటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఎన్నో కొత్త కథాంశాలతో సినిమాలను చూసే అవకాశాలను కలిసాగిస్తుందనీ, తమ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో చేతులు కలిపినందుకు వారికి మా ధన్యవాదాలని ఆంటోని పెరంబవూర్ అన్నారు.