Nara Lokesh: నోటీసులు అందుకున్న తర్వాత తొలిసారి స్పందించిన నారా లోకేశ్
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు నోటీసులు
- ఇవాళ ఢిల్లీ వచ్చిన సీఐడీ అధికారులు
- సీఐడీ... వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందన్న లోకేశ్
- లేని కేసులు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యలు
- తప్పు చేయలేదు కాబట్టే దమ్ము ధైర్యంతో నిలబడ్డానని వెల్లడి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోటీసుల అంశంపై స్పందించారు.
"సీఐడీ అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయింది. లేని కేసులు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు... కానీ పెద్ద కుంభకోణం జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. అందులో నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సీఐడీ అధికారులు నా వద్దకు వచ్చినప్పుడు... "మేం ఢిల్లీకి వస్తే లోకేశ్ కనబడడంలేదు, లోకేశ్ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు" అంటూ మీరు ఎందుకు మాట్లాడారని వాళ్లను అడిగాను. అందుకు వాళ్లేమన్నారంటే... మేం ఈ ఉదయమే విమానంలో ఢిల్లీ వచ్చాం. నేరుగా మీ వద్దకే వచ్చి నోటీసులు ఇస్తున్నాం... అంతేతప్ప, మీ కోసం ఇంతకుముందెప్పుడూ మేం ఢిల్లీకి రాలేదు అని వాళ్లు కూడా స్పష్టంగా చెప్పారు.
ఇలాంటి ప్రచారం పట్ల నేను నిరసన తెలుపుతున్నాను... దర్యాప్తు అధికారికి కూడా చెప్పండి... సీఐడీ కూడా దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఉందని వారికి స్పష్టం చేశాను. అవసరమైతే ఈ విషయంలో దర్యాప్తు అధికారిపైనా, అవసరమైతే డీజీపీపైనా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని వాళ్లతో చెప్పాను.
నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సీఐడీ అధికారులకు కాఫీ, టీలు ఇచ్చి నోటీసులో ఉన్నదంతా చదివి సంతకం పెట్టాను. అందులో ఉన్న సెక్షన్లపై నాకు పెద్దగా అవగాహన లేకపోవడంతో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆ సెక్షన్లను వివరించారు.
నూటికి నూరు శాతం విచారణకు హాజరవుతాను. అందులో సందేహమే అక్కర్లేదు. వాళ్లలాగా వాయిదాలు అడగను. నాకున్న అవగాహన మేరకు జగన్, ఆయన కేసులకు సంబంధించిన వాళ్లు ఇప్పటివరకు 2 వేల సార్లు వాయిదా కోరారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే!
ఆయన పదేళ్లుగా బెయిల్ పై బతుకుతున్నాడు. ఆయన గానీ, ఏ2 విజయసాయిరెడ్డి గానీ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. మేం ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టి మాకు ఆ అవసరంలేదు. నాపై పెట్టింది దొంగ కేసు... ఎలాంటి ఆధారాలు లేవు. మేం తప్పు చేసుంటే వాళ్లు ఆధారాలు చూపించి ఉండేవాళ్లు.
అవగాహన లేని వాళ్లు నేను వెళ్లిపోయానంటూ మాట్లాడుతున్నారు. నేను ఢిల్లీ వచ్చినప్పటి నుంచి అశోకా-50లో ఒక్క బ్లూ మీడియాతో తప్ప మిగతా మీడియాతో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉన్నాను కదా. నేను విదేశాలకు వెళ్లిపోయానని అన్నారు. అదే రోజున నేను రాష్ట్రపతిని కలిశాను. వాళ్ల లాగా పారిపోయే అలవాటు నాకు లేదు. వాళ్ల లాగా తల్లిని ఆసుపత్రిలో చేర్చి అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంలేదు.
మేం నీతి నిజాయతీగా పరిపాలించాం... టీడీపీకి అధికారం కొత్త కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టే దమ్ము ధైర్యంతో నిలబడ్డాను. ఇవాళ సీఐడీ వాళ్లు వచ్చారు... లవ్ లెటర్ ఇచ్చారు. సంతకం పెట్టి నేనో కాపీ ఉంచుకుని, వాళ్లకో కాపీ ఇచ్చాను. అక్టోబరు 4న కచ్చితంగా విచారణకు హాజరవుతా" అని లోకేశ్ స్పష్టం చేశారు.