Archana Gautam: నడిరోడ్డుపై జరిగిన అత్యాచారానికి ఇది తక్కువేమీ కాదు.. కాంగ్రెస్ కార్యాలయం బయట జరిగిన దాడిపై పెదవి విప్పిన నటి అర్చన గౌతం

Archana Gautam Breaks Silence On Getting Manhandled Outside Congress Office In Delhi

  • మూడ్రోజుల క్రితం ఢిల్లీలో ఖర్గే,  ప్రియాంకను కలిసేందుకు వెళ్లిన అర్చన
  • లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న కొందరు
  • తన జుత్తుపట్టుకుని లాగారని ఆరోపణ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు
  • తనతో అసభ్యంగా ప్రవర్తించిన వారిలో మహిళలు కూడా ఉన్నారని ఆవేదన
  • మీడియా సమావేశం పెట్టి నిజాలు వెల్లడిస్తానన్న బిగ్‌బాస్-16 ఫేమ్ 

ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం తనపై జరిగిన దాడిపై బిగ్‌బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతం ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసి అభినందించేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి అర్చన చేరుకున్నారు. అక్కడ వారికి తీవ్ర పరాభవం ఎదురైంది. కొందరు వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాదు, వారిపై భౌతికదాడి కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమపై జరిగిన దాడిపై ఓ న్యూస్ చానల్‌ కార్యక్రమంలో అర్చన మాట్లాడారు. 

‘‘వారు  మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గేట్లు తెరవలేదు. ‘మిమ్మల్ని లోపలికి అనుమతించవద్దని మాకు అదేశాలున్నాయి’ అని వారు మాతో చెప్పారు. అయితే, దాని వెనక ఉన్న కారణం నాకు తెలియదు. మొత్తానికి ఏదో రకంగా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నా. వారిని (ఖర్గే, ప్రియాంక) అభినందించాలనే అక్కడికి వెళ్లాను. బిగ్‌బాస్ ముగిసినప్పటి నుంచి నేను పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు కాబట్టి మంచి స్వాగతం లభిస్తుందని భావించా. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారిలో మహిళలు కూడా ఉన్నారు’’ అని అర్చన వాపోయారు. 

‘‘కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగిన దాడిలో నా తండ్రి గాయపడ్డారు. నా డ్రైవర్ తలపై కొట్టారు. ఇది సరికాదు. నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజమేంటో వెల్లడిస్తా. వారు నా జత్తు పట్టుకుని లాగారు. నడిరోడ్డుపై జరిగిన అత్యాచారానికి ఇది తక్కువేమీ కాదు. నేను చేతులు జోడించి వేడుకున్నాను. నా తండ్రి భయపడిపోయారు’’ అని అర్చన వివరించారు. 

రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంక గాంధీకి కానీ ఈ విషయం తెలియదనే అనుకుంటున్నానని, వారి నుంచి ఫోన్ వస్తుందని ఆశిస్తున్నానని అర్చన చెప్పారు. తాను ఎల్లప్పుడూ వారికి మద్దతుగా నిలిచానని అర్చన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News