Pakistan: ఆత్మాహుతి దాడుల వెనక భారత్.. పాకిస్థాన్ మంత్రి సంచలన ఆరోపణలు
- మస్తుంగ్ లో శుక్రవారం బాంబు పేలుళ్లు.. 65 మంది మృతి
- ఈ పేలుళ్ల వెనక ‘రా’ ప్రమేయం ఉందని ఆరోపించిన పాక్
- సూసైడ్ బాంబర్ డీఎన్ఏను విశ్లేషిస్తున్న నిపుణులు
ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి.. ఈ విషయంలో రెండు దేశాల నేతలు, అమెరికా నేతలు కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. భారత్ పై దాయాది దేశం సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పేర్కొంది. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని పాక్ మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ చెప్పారు.
ఈ ఘటనపై విచారణ జరిపించి, ఆధారాలు సేకరిస్తామని వివరించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ నిందితుడిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఇండియా- పాక్ మధ్య పెనుదుమారం రేపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ లోని మస్తుంగ్ జిల్లాలో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదు దగ్గర్లో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.
దీంతో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన 60 మంది పౌరులు చనిపోయారు. అదేసమయంలో ఖైబర్ ఫఖ్తున్ ఖ్వాలోని హంగూలో జరిగిన మరో సూసైడ్ అటాక్ లో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనలలో మొత్తం వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను ఖండించిన బలూచిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం.. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ ఈ దాడులపై విచారణ జరుపుతోంది.