Trivikram Srinivas: 'జై విఠలాచార్య' పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్

Trivkiram launches Jai Vithalacharya book penned by Pulagam Chinnarayana

  • జానపద బ్రహ్మగా పేరుగాంచిన సీనియర్ దర్శకుడు... విఠలాచార్య
  • 'జై విఠలాచార్య' పేరుతో పుస్తకం రాసిన సినీ జర్నలిస్టు పులగం చిన్నారాయణ
  • చిన్నారాయణను అభినందించిన త్రివిక్రమ్

ఇప్పటి సినిమాల్లో గ్రాఫిక్స్ సర్వసాధారణంగా మారిపోయాయి గానీ, అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా జానపద చిత్రాలు తీసి ఔరా అనిపించిన మేటి దర్శకుడు విఠలాచార్య. అందుకే ఆయనను జానపద బ్రహ్మ అని పిలుస్తారు. విఠలాచార్య సినీ ప్రస్థానంపై ప్రముఖ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయాణ ఓ పుస్తకం రాశారు. 'జై విఠలాచార్య' పేరుతో తీసుకువచ్చిన ఈ పుస్తకాన్ని టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, సినీ జర్నలిస్టు పులగం చిన్నారాయణ మంచి పుస్తకాన్ని తీసుకువచ్చారని అభినందించారు. తెలుగు మాస్ సినిమా, తెలుగు జానపద చిత్రాలకు విఠలాచార్యను ఆద్యుడిగా చెప్పుకోవచ్చని అన్నారు. ఇప్పటి వీఎఫ్ఎక్స్ కు దీటుగా అప్పట్లోనే గొప్ప చిత్రాలను తెరకెక్కించిన మేటి సాంకేతిక నిపుణుడు విఠలాచార్య అని కీర్తించారు. 

అయితే, ఆయన సాధించిన విజయాలు, అప్పట్లో ఆయనకున్న పాప్యులారిటీ గురించి ఇప్పటివారికి తెలియదని, ఈ నేపథ్యంలో, ఆయన జీవితచరిత్రను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాసిన పులగం చిన్నారాయణను, ఈ పుస్తకాన్ని ముద్రించిన పబ్లిషర్ జిలానీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు  తెలిపారు. ఇలాంటి పుస్తకాలతో లాభాలు రావని తెలిసినా, సినిమాపై వాళ్లకున్న మమకారంతో ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నారని త్రివిక్రమ్ కొనియాడారు.

  • Loading...

More Telugu News