Kishan Reddy: ప్రధాని ఎవరిని అన్నారో అర్థం కానట్టు కేటీఆర్ నటించడం నవ్వు తెప్పిస్తోంది: కిషన్ రెడ్డి
- మహబూబ్ నగర్ లో మోదీ సభ
- బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శనాస్త్రాలు
- మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- చిన్న ట్రైలర్ కే గజగజ వణికిపోతున్నారన్న కిషన్ రెడ్డి
- రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితి ఏమిటని వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనలో బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఏకిపారేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా బదులిచ్చారు. దీనిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. "ప్రధాని అన్నది ఫాంహౌస్ కుటుంబాన్ని. అది అర్థం కానట్టు కేటీఆర్ నటించడం నవ్వు తెప్పిస్తోంది" అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్దే అయితే... ముఖ్యమంత్రిని చేస్తానని చేయకుండా దళితులను ఎందుకు దగా చేస్తాడు? పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి, ఇవ్వకుండా కేసులు పెట్టిస్తూ అడవి బిడ్డలను ఎందుకు మోసం చేస్తాడు? సాకులు చూపుతూ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను ఎందుకు నిలువునా వంచిస్తాడు? ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే పిల్లలకు ఎందుకు మంచి ఆహారం పెట్టించడు? నిత్యం ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు కనీసం స్పందించడు? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు.
మోదీ సభకు వచ్చిన అద్భుత ప్రజాస్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమాగమవుతోందని తెలిపారు. చిన్న ట్రైలర్ కే గజగజ వణికిపోతుంటే రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితి ఏమిటో అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.