Chandrababu: చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా 19వ రోజు కొనసాగిన టీడీపీ నిరసనలు
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ నినదించిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం
- తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు 19వ రోజూ కొనసాగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ శ్రేణుల నిరసనలను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బోడె ప్రసాద్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి రూరల్ పరిధిలోని నిడిమామిడి నుండి గంట్లమారెమ్మ వరకు పాదయాత్ర చేపట్టారు.
నరసరావుపేటలో ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. వినూత్నంగా చేతులకు సంకెళ్లు వేసుకొని నేతలు దీక్ష చేపట్టారు. మదనపల్లి నియోజకవర్గంలో దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. నల్ల కండువాలతో, చేతులకు సంకెళ్ళతో నిరసన తెలిపారు.
కర్నూలులో న్యాయవాదులు రిలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంఘీభావం ప్రకటించారు. ఇక, 101 ఘటాలతో పాడేరు మోదకొండమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. ఘటాలతో మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు.
విశాఖ గాజువాక జంక్షన్లో పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. పలమనేరు పట్టణంలోని గాంధీనగర్ హిందూ శ్మశాన వాటికలో రగిలే కాష్టంలా మండుతున్న కాగడాలను ఏర్పాటు చేసుకొని దాని ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకొని, నల్ల కండువాలు వేసుకొని రిలే నిరాహారదీక్ష కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఈ దీక్షలో పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెయ్యిమందికి పైగా టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్రకు బయలుదేరిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీలో టీడీపీ నేతలు కేఎస్ జవహర్, అరిమిల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మహిళల నిరసనలో పాల్గొనేందుకు వెళుతుండగా పోలీసులు 14వ మైలు దగ్గర అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బందరు మండలంలోని కానూరు చింత కాలువలో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.