Nara Lokesh: నిజాయతీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారా అని షేక్ అయ్యా: నారా లోకేశ్

Shocked To See Chandrababu In Jail Says Nara Lokesh

  • చంద్రబాబు అరెస్టుపై సిగ్గుపడడం లేదు, బాధపడుతున్నామన్న లోకేశ్ 
  • సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టుకుంటూ పోతే ఏ ఒక్కరినీ వదలకుండా అరెస్ట్ చేయొచ్చని వ్యాఖ్య 
  • లండన్‌లో రాహుల్‌గాంధీని జగన్ కలిశారన్న వదంతులపై స్పందించనని కామెంట్ 
  • వైసీపీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టడంలో విఫలమయ్యామని వెల్లడి 
  • ప్రస్తుతానికి తాము జనసేనతోనే ఉన్నామన్న లోకేశ్  

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తన తండ్రి చంద్రబాబును చూసిన క్షణంలో తాను షేకయ్యానని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నిజాయతీగా పనిచేసిన ఓ వ్యక్తి ఇక్కడికి వచ్చారా? అని బాధ అనిపించిందని పేర్కొన్నారు. గత రాత్రి ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుండడాన్ని తాను సందేహించబోనని పేర్కొన్నారు. అయితే, న్యాయం ఆలస్యం కావడాన్ని మాత్రం శిక్షగా భావిస్తున్నానని, ఓ పౌరుడిగా ఇది తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆధారాల్లేని కేసులో ఆయనను ఇన్ని రోజులుగా రిమాండ్‌లో ఉంచడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అరెస్టుపై తాము సిగ్గుపడడం లేదని, బాధపడుతున్నామని పేర్కొన్నారు. జగన్‌లా లక్షకోట్లు తిని జైలుకు వెళ్తే బాధ ఉండదని, తిన్నాం కాబట్టి జైలుకు వచ్చామని సర్దిచెప్పుకుంటామన్నారు. చేయని తప్పుకు జైలులో పెడితే ఏ కుమారుడికైనా బాధ ఉంటుందని లోకేశ్ చెప్పుకొచ్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. జగన్ కేసు ఒకటి కాదు
జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఒక్కటి కాదన్న లోకేశ్.. జగన్ కేసులో ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, స్కిల్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి మంత్రిని, ఎంపీని, ఎమ్మెల్యేను కూడా జైళ్లకు పంపొచ్చని లోకేశ్ అన్నారు. ‘పరిశీలించండి’ అని వినతిపత్రం ఇచ్చినా సరే రికమెండేషన్‌గా భావించి జైలుకు పంపొచ్చని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని అన్నారు. తాను మంత్రిగా 2 వేల ఫైళ్లను క్లియర్ చేశానని, ఒక్కో ఫైల్‌కు సగటున 55 నిమిషాలు మాత్రమే పట్టిందని అన్నారు. అంత వేగంగా పనిచేయడం తప్పని, కనీసం 55 రోజులు తీసుకుంటే బాగుండేదోమోనని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. టీసీఎల్ కంపెనీతో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఒక్క లంచ్ మీట్‌లోనే ఓకే చేశామని, ఇలాంటి వాటిని తప్పుపడితే కక్షలకు అంతే లేకుండా పోతుందని అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరిపైనా తాము న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

లండన్‌లో రాహుల్ గాంధీని జగన్ కలిశారన్న వార్తలొచ్చాయి  
చంద్రబాబు అరెస్ట్ వెనక ఫలానా వారి హస్తం ఉందని అందరిలా ఆరోపించే రకం తాను కాదని లోకేశ్ పేర్కొన్నారు. లండన్‌లో రాహుల్‌గాంధీని జగన్ కలిశారన్న వార్తలు వచ్చాయని కానీ, ఇలాంటి ఊహాగానాలపై తాను మాట్లాడబోనని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ లాభపడిందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల ఫలితాలే చెబుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తున్నామని, సీపీఐ, సీపీఎంతో కలిసి పనిచేయడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అందుకే సైకో పోవాలని అంటున్నారు
కోడికత్తి కేసు, బాబాయ్ హత్య, ఒకే కులం వారికి డీస్పీలుగా పదోన్నతులు వంటి అబద్ధాలను ఢిల్లీ వరకు ప్రచారం చేయడంలో అప్పట్లో వైసీపీ విజయం సాధించిందని, తాము సమర్థంగా వాటిని ఖండించలేకపోయామని లోకేశ్ పేర్కొన్నారు. ఇప్పుడవి అబద్ధాలని తెలియడంతోనే ప్రజలు సైకో పోవాలని అనుకుంటున్నారని అన్నారు. జగన్ తప్ప ఆ పార్టీలోని వారందరూ చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మీడియా బాధితురాలిగా మారిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News