Cyber crime: రూ. 50కే ఏడాది అమెజాన్.. రూ. 20కే నెలంతా నెట్ ఫ్లిక్స్ అంటూ సందేశాలా.. లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీనే!
- ఓటీటీ సబ్ స్క్రయిబర్లనూ వదలని సైబర్ నేరగాళ్లు
- తక్కువ రేటుకే ఓటీటీ ఆఫర్లు అంటూ ఎర
- హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో మోసాలు
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాల అత్యాశ, అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు. వారి వలలో చిక్కుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ఓటీటీ వినియోగదారుల మీద పడ్డారు. తక్కువ రేటుకే ప్రముఖ ఓటీటీ సర్వీసుల ఆఫర్లు అంటూ మోసం చేస్తున్నారు. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ.50 అంటూ సందేశాలు పంపిస్తున్నారు. నెలకు రూ.20 కట్టి నెట్‌ఫ్లిక్స్ ను వాడుకోవచ్చు అంటూ మోసపూరిత ఆఫర్ల ఎర చూపి లక్షలు దోచేస్తున్నారు. ఇలాంటి లింక్స్ ను ఈ మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు రూపంలో పంపిస్తున్నారు.
మంచి ఆఫర్ అనుకుని లింకు క్లిక్‌చేసి.. ఓటీపీ నమోదు చేసిన వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఓటీటీ సంస్థలు నెలవారీ, వార్షిక గడువు ముగిస్తే పునరుద్ధరించుకోవడానికి ఖాతాలో రిజిస్టర్ చేసిన ఈమెయిల్‌కు సందేశం పంపిస్తాయి. సైబర్ ముఠాలు కూడా ఇలాంటి తరహాలోనే సందేశాలు పంపించి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.