P Narayana: హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట.. బెయిల్ పొడిగింపు
- అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు కేసు
- ఇప్పటికే ముందస్తు బెయిల్ లో ఉన్న నారాయణ
- తమకు కొంత సమయం కావాలని కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాదులు
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే నారాయణకు ఉన్న ముందస్తు బెయిల్ ను పొడిగించాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇదే సమయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరడంతో కేసు విచారణను రెండు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.
నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ ను పొడిగించింది. బాబితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి, కొనుగోలు చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు అయాచిత లబ్ధి పొందారని ఆరోపించింది.