Hydearbadi Man: రెండు రోజుల్లో కూతురు పెళ్లి.. ఇండియాకు వెళ్లే ఏర్పాట్లలో ఉన్న తండ్రి హత్య.. లండన్ లో ఘోరం
- ఈ నెల 5న హైదరాబాద్ లో కుమార్తె వివాహం
- ఉపాధి కోసం 2011 నుంచి లండన్ లో ఉంటున్న హైదరాబాదీ రయీసుద్దీన్
- మరో స్నేహితుడితో కలిసి వెళుతుండగా దుండగుల దాడి
- కత్తిపోట్లతో ఇద్దరూ చనిపోయారని వెల్లడించిన పోలీసులు
లండన్ లో ఘోరం జరిగింది.. ఉపాధి కోసం వలస వెళ్లిన హైదరాబాదీపై దాడి జరిగింది. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆయన దగ్గర ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన ప్రాణం పోయింది. ఆయనతో పాటు ఆఫ్ఘనిస్థాన్ జాతీయుడు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. లండన్ పోలీసులు, మృతుడి కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ కు చెందిన ఖాజా రయీసుద్దీన్ 2011లో ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి వెస్ట్ యార్క్ షైర్ లోని లీడ్స్ లో నివసిస్తున్నాడు. ఈ నెల 5న హైదరాబాద్ లో కూతురు వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేందుకు రయీసుద్దీన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన స్నేహితుడు ఆఫ్ఘనిస్థాన్ దేశస్తుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతుండగా ఉగాండా జాతీయుడిగా అనుమానిస్తున్న దుండగుడు దాడి చేశాడు.
కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో స్నేహితులిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులతో దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా రయీసుద్దీన్ తో పాటు అతడి స్నేహితుడు కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, రయీసుద్దీన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ కు చేర్చేలా చూడాలని బాధిత కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.