Team India: ఒకే దెబ్బతో సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న టీమిండియా
- ఆసియా క్రీడల క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో నేపాల్ ను ఓడించిన భారత్
- యశస్వి శతకం, సత్తా చాటిన బౌలర్లు
- ఇప్పటికే స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు
ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఒకే ఒక్క విజయంతో పతకం ఖాయం చేసుకుంది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన రుతురాజ్ కెప్టెన్సీలోని యువ భారత్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో నేపాల్ ను ఓడించి సెమీఫైనల్ చేరుకుంది. తొలుత భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం సాధించాడు. ఆసియా క్రీడల్లో శతకం సాధించిన భారత తొలి ఆటగాడిగా, టీ20ల్లో శతకం కొట్టిన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు.
రింకూ సింగ్ (15 బంతుల్లో 37 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (25), శివం దూబె (25 నాటౌట్) కూడా రాణించారు. నేపాల్ బౌలర్లు దీపేంద్ర రెండు, సందీప్, సోంపాల్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసి ఓడింది. దీపేంద్ర సింగ్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(3/24), ఆవేష్ ఖాన్(3/32) చెలరేగారు. కాగా, ఈ క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలిచింది.