Angallu Case: అంగళ్లు అల్లర్ల కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- దేవినేని, చల్లాబాబు సహా పలువురికి హైకోర్టు బెయిల్
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.
ఈ కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా ఈరోజు ఇదే ధర్మాసనం విచారణ జరపబోతోంది.