Narendra Modi: నిజామాబాద్లో మోదీ చెప్పిన రహస్యం నిజమే అయి ఉంటుంది: విజయశాంతి
- నిజామాబాద్లో కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు
- 2009లో లూధియానాలో ఎన్డీయే ర్యాలీకి కేసీఆర్ హాజరయ్యారని గుర్తు చేసిన విజయశాంతి
- మోదీని తిట్టడం సమంజసం కాదన్న ‘రాములమ్మ’
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ విషయంలో ప్రధానిని తిట్టడం సరికాదని అన్నారు. నిన్న నిజామాబాద్లో పర్యటించిన మోదీ.. ఇప్పటి వరకు ఎవరికీ, ఎక్కడా చెప్పని రహస్యం చెబుతున్నానంటూ కేసీఆర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తన వద్దకు వచ్చిన కేసీఆర్ తాను ఎన్డీయేలో కలవాలని అనుకుంటున్నానని, తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నానని ఆశీర్వదించాలని కోరారని గుర్తు చేసుకున్నారు. అయితే, ఇదేమీ రాచరికం కాదని, పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పానని పేర్కొన్నారు. పాలకులు కావాలంటే ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై ‘రాములమ్మ’ స్పందించారు. మోదీ వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయని భావిస్తున్నట్టు ఎక్స్ చేశారు. ఎందుకంటే 2009లో మహాకూటమి పేరుతో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్ కౌంటింగ్ డబ్బాలు తెరవకముందే లూథియానా ఎన్డీయే ర్యాలీకి హాజరయ్యారని, ఈ విషయం ప్రజలకు ఇంకా గుర్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రధానిని కేటీఆర్ దూషించడం సరికాదని హితవు పలికారు.