Sikkim: ఉప్పెనలా ముంచుకొచ్చిన వరద.. సిక్కింలో 23 మంది సోల్జర్ల గల్లంతు.. వీడియో ఇదిగో!
- రాత్రంతా కుండపోత వర్షానికి ఉప్పొంగిన తీస్తా నది
- ఛుంగ్ తాంగ్ డ్యామ్ నుంచి భారీగా నీటి విడుదల
- లాఛెన్ వ్యాలీలో వరదలు.. కొట్టుకుపోయిన ఆర్మీ వాహనాలు
సిక్కింలో రాత్రంతా కుండపోత వర్షం కురిసింది.. దీంతో నదులు ఉప్పొంగి లాఛెన్ లోయను వరద ముంచెత్తింది. ఎగువ నుంచి పెద్దమొత్తంలో వరద వచ్చి చేరడంతో తీస్తా నదిపై ఉన్న ఛుంగ్ తాంగ్ డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. సింగ్ టామ్ సమీపంలోని బర్దాంగ్ లో పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. మొత్తంగా 23 మంది సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కనిపించకుండా పోయిన సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించింది.
అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సింగ్ టామ్ లో పరిస్థితి బీభత్సంగా ఉందని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. వరద నష్టం తీవ్రంగా ఉందని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సైనికులతో పాటు సింగ్ టామ్ లో పలువురు సామాన్య ప్రజలు కూడా గల్లంతయినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా, లోతట్టు ప్రాంతాలైన గాజొల్డోబా, డోమోహని, మెఖాలిగంజ్, ఘిష్ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.