Kishan Reddy: రండి.. దొరగడీలను బద్దలుగొట్టండి.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. ఎక్స్‌లో కిషన్‌రెడ్డి పిలుపు
- తెలంగాణలో ముదురుతున్న బీజేపీ-బీఆర్ఎస్ వ్యవహారం
- ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడిన కిషన్‌రెడ్డి
- ఉద్యమకారులపై బురదజల్లి పార్టీ నుంచి వెలేసిన నీచబుద్ధి కేసీఆర్‌ది అంటూ విమర్శలు
- కల్వకుంట్ల కుటుంబం మోసాన్ని ఇప్పటికైనా గుర్తించాలని విజ్ఞప్తి
- పదవులు దూరం చేశారన్న ఒకే ఒక్క కారణంతో ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారని ఆవేదన
చూస్తుంటే తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1, 3 తేదీల్లో పాలమూరు, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఇరు పార్టీలు ఒకదానిపై మరోటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నిన్న మోదీ రాక సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న సాయంత్రం నిజామాబాద్‌లో పర్యటించిన మోదీ రహస్యం చెబుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. దీనికి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాజాగా, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
నాకు పదవులే అవసరం లేదని, తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, దళతుడిని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడే కేసీఆర్‌కు ఉన్న పదవీకాంక్ష, రాజ్యకాంక్ష ఏపాటిదో అర్థమైందని ఎద్దేవా చేశారు. కుటుంబం మొత్తానికి పదవులు కట్టబెట్టి.. తనకు, తన కుటుంబ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నవారిని తరిమికొట్టిన కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు. సచివాలయానికి రాలేని కేసీఆర్, అలసిపోయానని ప్రధానికి మొరపెట్టుకున్న కేసీఆర్ కొడుకుని రారాజు చేయడానికి పాకులాడుతున్నారని ఆరోపించారు.
తన మాటలను కాదన్నాడన్న ఒకే ఒక్క కారణంతో కీర్తించిన నోటితోనే ప్రధానిని తూలనాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడు సహా బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రధానిపై దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని వెల్లడించిన వాస్తవాలతో కేసీఆర్ కుటిలబుద్ధి, రాజ్యకాంక్ష, పదవీకాంక్ష ఏపాటిదో, వారికి మద్దతు తెలపడం ఎంత ప్రమాదకరమో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలంటే కేసీఆర్ కుటుంబ సభ్యుడే కావాలా? ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడిన వేలాదిమంది ఉద్యమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కాకూడదా? అని ప్రశ్నించారు. ఈ కారణంగానే తనకు అడ్డుగా ఉన్న అసలైన ఉద్యమకారులపై బురదజల్లి వారిని పార్టీ నుంచి వెలివేసిన నీచబుద్ధి కేసీఆర్‌దని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమకు దక్కాల్సిన పదవులను దూరం చేశారన్న ఒకే ఒక్క కారణంతో మోదీని ఇంటిల్లిపాదీ దిగజారిపోయి విమర్శిస్తున్నారని, వారి ఆక్రోశానికి కారణం నేడు బయటపడిందని పేర్కొన్నారు.
తమ పదవీకాంక్ష కోసం, రాజ్యకాంక్ష కోసం వందలాది మంది అమరుల ఆకాంక్షలను తొక్కిపెట్టి, వారి సమాధులపై కోట కట్టుకున్న కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం కుటిల బుద్ధిని, సంకుచిత మనస్తత్వాన్ని, మోసకారితనాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికైనా గుర్తించి, ఉద్యమకాంక్షను గుర్తు తెచ్చుకొని దొర గడీలను బద్దలు కొట్టాలని, గట్టిగా బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.