Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు
- పెడన సభలో గూండాలతో రాళ్ల దాడి చేయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిందన్న పవన్
- శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్య
- ఏ సమాచారంతో ఈ వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కు నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడన బహిరంగ సభకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నోటీసులు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం గూండాలను, క్రిమినల్స్ లను పెడన సభలోకి చొప్పించి... రాళ్ల దాడి చేసేందుకు, గొడవలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోందని నిన్న పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, వైసీపీ నేతలకు, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి ఒకటే చెపుతున్నానని... పెడన సభలో ఎలాంటి గొడవ జరిగినా సహించబోమని హెచ్చరించారు.
రాష్ట్ర సుస్థిరత కోసం జనసేన, టీడీపీలు కలిసిన నేపథ్యంలో... దీన్ని చెడగొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. పెడన సభలో రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్ అటాక్స్ జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమాచారంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని చెప్పారు. అసాంఘిక శక్తులను తాము ఉపేక్షించబోమని తెలిపారు. అయితే పోలీసుల నోటీసులకు పవన్ కల్యాణ్ కానీ, జనసేన కానీ ఇంత వరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.