Chandrababu: చంద్రబాబు బెయిల్, సీబీఐ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
- తొలుత వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాది ప్రమోద్ కుమార్
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు
- తదుపరి వాదనల కోసం విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ న్యాయస్థానం
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఈ పిటిషన్లను విచారించనుంది. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. మధ్యాహ్నం తర్వాత సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని పొన్నవోలు కోర్టును కోరారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి రూ.371 కోట్ల దుర్వినియోగం జరిగిందన్నారు. డొల్ల కంపెనీలతో దోచుకున్నారన్నారు. 2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించిందని, సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరిందని తెలిపారు.
కేసు కేంద్ర దర్యాఫ్తు సంస్థల విచారణలో ఉన్న సమయంలోనే 2018లో 17ఏ సవరణ జరిగిందని, ఈ క్రమంలో 17ఏ చంద్రబాబుకు వర్తించదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాలను కోర్టు ముందు ఉంచామని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందన్నారు. సీమెన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని జీవో నెంబర్4లో ఎందుకు చూపించలేదని అడిగారు. కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవమన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.