TDP Everest: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన తెలుగుదేశం జెండా
- ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
- అనుమోలు ప్రభాకర్ తో పాటు 20 మంది సాహసయాత్ర
- చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. విదేశాలలో సైతం టీడీపీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలను చేపడుతూ చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో ఎవరెస్ట్ వద్ద కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన అనుమోలు ప్రభాకరరావుతో పాటు 20 మంది సాహసయాత్రను చేపట్టారు. బేస్ క్యాంప్ వద్ద టీడీపీ జెండాలు చేతపట్టి, చంద్రబాబుకు మద్దతుగా, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ... 10 రోజుల క్రితం హిమాలయాల యాత్రను చేపట్టామని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా బేస్ క్యాంప్ వద్ద టీడీపీ జెండాను ఎగురవేశామని చెప్పారు.