Chandrababu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు కోరుతూ కోర్టులో సీఐడీ మెమో
- నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ గడువు
- ఏసీబీ కోర్టు జడ్జి ముందు వర్చువల్ గా ఆయనను హాజరు పరిచే అవకాశం
- బెయిల్ పై వాదనలు వినిపిస్తున్న అడిషనల్ ఏజీ పొన్నవోలు
తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈమేరకు గురువారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. గురువారం (నేటి) తో చంద్రబాబు రిమాండ్ గడువు ముగుస్తుండడంతో సీఐడీ అధికారులు మరోమారు పొడిగింపు కోరుతున్నారు. మరోవైపు, రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. వర్చువల్ గా హాజరు పరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బుధవారం పొన్నవోలు వాదనలు పూర్తికాకపోవడంతో విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై పొన్నవోలు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.