Harish Rao: ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణ విషయంలో గవర్నర్ పై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కేసీఆర్ విశ్వబ్రాహ్మణులు, ఎరుకల జాతికి అవకాశమిచ్చారన్న హరీశ్ రావు
- గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శ
- బీజేపీలో ఉండి తమిళిసై గవర్నర్ అయ్యారన్న హరీశ్ రావు
గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేబినెట్ ప్రతిపాదించగా, ఆ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి హరీశ్ రావు గురువారం తీవ్రంగా స్పందించారు. విశ్వబ్రాహ్మణులు, ఎరుకల జాతికి కేసీఆర్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారని, కానీ గవర్నర్ ఆ పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎరుకల జాతిని, విశ్వబ్రాహ్మణులను రిజెక్ట్ చేసిందన్నారు. కాబట్టి ఈ కులాలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.
ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా? బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా? బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా? అని ప్రశ్నించారు. తమిళిసై బీజేపీలో ఉండి గవర్నర్ అయ్యారని, అలాంటప్పుడు కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్‌లో ఉండి ఎమ్మెల్సీ కావొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణకు మరో నీతి ఉంటుందా? అని నిలదీశారు.