Vladimir Putin: ‘ఒక్క అణ్వాయుధం రష్యాపై పడబోతోందనగానే..’ ప్రపంచానికి పుతిన్ వార్నింగ్
- వందలాది అణ్వాయుధాలు గాల్లోకి ఎగురుతాయని హెచ్చరిక
- ఖండాంతర అణ్వాయుధాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడి
- వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడతామని వార్నింగ్
ఉక్రెయిన్ పై దాడి మొదలైన తర్వాత ప్రపంచ దేశాల నుంచి రష్యాపై ఒత్తిడి పెరిగింది. అణు దాడికి సంబంధించిన బెదిరింపులూ ఎదురయ్యాయి. అయితే, తమ దేశ రక్షణ విషయంలో వెనుకడుగు వేసేదిలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, పుతిన్ మరోమారు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
రష్యా భూభాగంపై అణు దాడి చేయాలనే ఆలోచన చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. తమ దేశంపై ఒక్క అణ్వాయుధం పడబోతోందనగానే .. మరుక్షణంలోనే వందలాది అణ్వాయుధాల క్షిపణులు గాల్లోకి ఎగురుతాయని స్పష్టం చేశారు. ఇటీవలే అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ వెల్లడించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమ అణ్వాయుధాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. శత్రువులు ఎంతమంది ఉన్నాసరే ఒక్కరినీ వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు.