Forrest Galante: పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న అటవీ సాహసికుడు.. వీడియో ఇదిగో!
- ప్రముఖ జీవశాస్త్రవేత్తకు ఫారెస్ట్ గలాంటేకు భయంకర అనుభవం
- అటవీ ప్రాంతంలో ఓ మడుగులో ఉండగా పెద్దశబ్దంతో పడిన పిడుగు
- ఒక్కసారిగా కిందపడిన కెమెరా, భయంతో పరుగులు
పిడుగుపాటుకు గురై మరణించిన వారు ఎందరో. తీవ్ర గాయాలతో బయటపడిన వారూ ఉన్నారు. కానీ, మన పక్కనే పిడుగు పడితే.. దాని నుంచి తప్పించుకుని బతికి బట్టకడితే.. నిజానికి ఈ అనుభవం చాలా భయంకరమైనది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, అటవీ సాహసికుడు ఫారెస్ట్ గలాంటేకి. అంతేకాదు, ఈ ఘటన మొత్తం అతడి కెమెరాలో రికార్డైంది. ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లాడ్స్ నగరంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిస్కవరీ ప్లస్, యానిమల్ ప్లానెట్ చానెళ్లలోనూ గలాంటే కార్యక్రమాలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్ కోసం ‘గేర్ రివ్యూ’ అనే కార్యక్రమం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
గలాంటే పిడుగుపాటు నుంచి క్షణాల్లో తప్పించుకున్న వీడియోను ఎడ్ క్రాసెంటీన్ అనే జర్నలిస్ట్ ఎక్స్‌లో పంచుకున్నారు. అటవీ ప్రాంతంలోని ఓ మడుగులో మోకాలి లోతులో నిల్చున్న గలాంటే జీపీఎస్ ప్రాముఖ్యతను వివరిస్తుండగా అకస్మాత్తుగా కెమెరా కిందపడిపోయింది. ఆ వెంటనే పెద్ద శబ్దం వినిపించింది. ఆయన నిల్చున్న వెనక పెద్ద వెలుగు కనిపించింది. దీంతో భయపడిపోయిన గలాంటే నీట్లోంచి ఒడ్డుకు పరిగెత్తుకొస్తూ.. నేను గాయపడ్డాను అంటూ అరవడం ఆ వీడియోలో వినిపించింది. అయితే, ఆ తర్వాత తాను బాగానే ఉన్నట్టు నెటిజన్లకు రిప్లై ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన వారు తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు నీటిలో ఉండకూడదని సలహా ఇస్తున్నారు. అంత పెద్ద పిడుగు నుంచి తప్పించుకున్నాడంటే అతడికింకా ఈ భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.