Jogging: 30 నిమిషాల పాటు జాగింగ్.. ఎన్నో ప్రయోజనాలు
- ఊపిరితిత్తులకు మంచి బలం
- అలసట, డిప్రెషన్ వంటి వాటిని తగ్గిస్తుంది
- గాఢమైన నిద్రకు అవకాశం
- సాయంత్రం కంటే ఉదయం ఎక్కువ కేలరీలు బర్నింగ్
నిశ్చలమైన జీవితం ఎన్నో వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కదలకుండా గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగ, వృత్తి జీవితం, ఇంట్లో అన్ని పనులకూ మెషిన్లు అందుబాటులోకి రావడంతో శరీరానికి శ్రమ తగ్గిపోతోంది. ఇది సుఖాన్నిస్తుందే కానీ, ఆరోగ్యాన్ని బలహీనం చేస్తుంది. అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. ప్రతి వ్యక్తీ రోజు వారీగా కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాల్సిందే. అప్పుడే జీవక్రియలు చురుగ్గా మారతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపడం సులభమవుతుంది. ప్రతి రోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (జాగింగ్) వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీగా నడవడం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది గుండె బలాన్ని పెంచుతుంది. జాగింగే కాదు, వాకింగ్ చేసినా ఇదే ప్రయోజనం నెరవేరుతుంది. 30 నిమిషాల పాటు నడవడం వల్ల 300-400 మధ్యలో కేలరీలు ఖర్చు అవుతాయి. జాగింగ్ తో పోలిస్తే రన్నింగ్ వల్ల మరిన్ని కేలరీలు కరుగుతాయ. దీనివల్ల బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది. అదనపు బరువు ఉన్నవారు, దాన్ని తగ్గించుకునేందుకు వీటిని ఫాలో కావొచ్చు.
- జాగింగ్ తో ఓర్పు, శారీరక సామర్థ్యం పెరుగుతాయి. దీంతో అలసట లేకుండా రోజువారీ పని సులభంగా చేసుకోవచ్చు.
- మానసిక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఒత్తిడి తగ్గిపోతుంది. ఆందోళన, డిప్రెషన్ కు కూడా ఇదే పరిష్కారం. మంచి మూడ్ ను ఇచ్చే ఎండార్ఫిన్ల విడుదలను జాగింగ్ ప్రేరేపిస్తుంది.
- రోజువారీ జాగింగ్ మెరుగైన నిద్రకు సాయపడుతుంది. జాగింగ్ సమయంలో శరీరంలో కేలరీల బర్నింగ్ జరగడం వల్ల శరీరం అలసటకు గురి అవుతుంది. ఇది కూడా నిద్ర మంచిగా పట్టేందుకు అనుకూలిస్తుంది.
- ఉదయం 30 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల స్టామినా బలపడుతుంది. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
- జాగింగ్, రన్నింగ్ చేయడం వల్ల ఆ సమయంలో శ్వాస ప్రక్రియ వేగవంతమవుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల సామర్థ్యాలు బలోపేతం అవుతాయి.
- వ్యాధి నిరోధక భక్తి పటిష్ఠమవుతుంది. యాంటీబాడీలు, తెల్ల రక్త కణాలను పెంచడం ద్వారా రక్షణను పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలపై పోరాడడం సులభమవుతుంది.
- రోజువారీ జాగింగ్ తో వచ్చే మరో ముఖ్యమైన విషయం.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- మెదడు పనితీరు సైతం చురుగ్గా మారుతుంది.