Devineni Uma: లోకేశ్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి కావాలా?: దేవినేని ఉమ
- ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగొచ్చిన లోకేశ్
- నేడు రాజమండ్రి పయనం
- లోకేశ్ వెంట వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం
- పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత రాత్రి ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన తన తండ్రి చంద్రబాబుతో ములాఖత్ కోసం రాజమండ్రి బయల్దేరారు. అయితే, ఆయన కాన్వాయ్ వెంట వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర తదితర టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై దేవినేని ఉమా మండిపడ్డారు. మేం నారా లోకేశ్ ను కలుసుకోకుండా మీరెందుకు అడ్డుకుంటున్నారు? అని ఆగ్రహంతో ప్రశ్నించారు.
"రాష్ట్రంలో రోజు రోజుకు నియంత పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. పిచ్చి పరాకాష్ఠకు చేరింది. అమరావతి నుంచి రాజమండ్రి బయల్దేరిన నారా లోకేశ్ వెంట ఎవరూ ఉండకూడదని పోలీసులు అడ్డుకుంటున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాలను ఆపేశారు. లోకేశ్ ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి తీసుకోవాలా? రాజమండ్రి వెళ్లాలంటే మీ దగ్గర వీసా తీసుకోవాలా?" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.